బోరులో మోటర్ లేకపోయినా పాతాళగంగ మాత్రం పైకి తన్నుకొస్తున్నది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన కుంట రంగారెడ్డి అనే రైతు పొలంలోని బోరు నుంచి 24 గంటలు నీరు పైకి ఉబికి వస్తున్నది. 15 ఏండ్ల క్రితం బోరు వేయగా, మోటరు బిగించకపోయినా పాతాళగంగ తరచూ ఎగిసిపడుతున్నదని రైతు రంగారెడ్డి తెలిపాడు. తనకున్న 10 ఎకరాలతోపాటు మరికొందరు రైతుల పొలాలకు సాగునీరు అందిస్తున్నదని చెప్పాడు. అటవీ ప్రాంతం కావడంతోపాటు సమీపంలో ఒర్రెలు ఉండటంతో నీరు ఇలా వస్తున్నదని ఆయన పేర్కొన్నాడు. నీరంతా కాలువ ద్వారా పొలాలు తడుపుతూ కిందకు వెళ్లి తిరిగి ఒర్రెలో కలుస్తున్నదని ఆ రైతు చెప్తున్నాడు.
– కోరె అరవింద్, ములుగు ఫొటోగ్రాఫర్