హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లలో సీసీఐ అమల్లోకి తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానం రైతులకు శాపంగా మారగా, దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. స్లాట్ బుకింగ్ కోసం తీసుకొచ్చిన ‘కిసాన్ కపాస్’ యాప్‌లో దళారులు స్లాట్స్‌ను బ్లాక్ చేస్తూ దందాకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలైన రైతులకు స్లాట్స్ దొరకకుండా చేస్తున్నట్టుగా తెలిసింది. దీంతో రైతులకు స్లాట్స్ దొరక్క వారు తమ పత్తిని విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సీసీఐకి పత్తి విక్రయించాలంటే రైతులు కచ్చితంగా కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాతే కొనుగోలు కేంద్రంలో పత్తిని తీసుకుంటారు.
రైతులు నిరక్షరాస్యులు కావడం, ఎక్కువ మంది వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నదాతలు తమకు తెలిసిన వారితో ఏఈవోలతో స్లాట్ బుక్ చేయించుకుంటున్నారు. వీరికి దళారుల రూపంలో మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. రైతుల వద్ద దళారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఈ పత్తిని మళ్లీ రైతుల పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర రూ.8,110కి విక్రయిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దళారులు రైతుల పేరిట కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్స్ బుక్ చేస్తున్నారు. నిజమైన రైతులకు స్లాట్స్ దొరకకుండా చేస్తున్నారని తెలిసింది.
స్లాట్ బుకింగ్ ఓపెన్ చేసే సమాచారం ముందుగానే దళారులకు చేరుతున్నట్టుగా తెలిసింది. దీంతో అప్రమత్తమవుతున్న దళారులు ముందే స్లాట్ బుకింగ్స్ చేస్తున్నారు. అసలైన రైతులకు స్లాట్స్ దొరకడమే లేదు. దళారుల దందాతో స్లాట్ బుకింగ్ లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.