నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ (Nagarkurnool ) కలెక్టర్ మెయిల్ కు గురువారం బాంబు బెదిరింపు (Bomb threat ) మెసేజ్ కలకలం రేపింది. అల్లాహు అక్బర్ అనే పేరుతో మెసేజ్ రాగా అధికారులు మధ్యాహ్నం చూసుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్ ను బాంబులతో పేలుస్తామంటూ మెసేజ్ లో ఉండడంతో కంగుతిన్న పోలీసులు హుటాహుటినా డీఎస్పీ(DSP) బుర్రి శ్రీనివాసులు, సీఐ కనకయ్య బాంబు స్క్వాడ్ (Bomb squad ) బృందంతో కలెక్టరేట్ కు చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
మెసేజ్ లో పెట్టిన మూడున్నర గంటల సమయం వరకు కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది టెన్షన్‌కు గురయ్యారు. సమయం దాటి పోవడంతో ఎలాంటి ఘటన చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం పోలీసులు మెయిల్ మెసేజ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.
మెయిల్ చేసిన వ్యక్తి పేరు ముప్పాల లక్ష్మణరావు అని ఉండడం, దాని కింద అల్లాహ్ అక్బర్ అని ఉందని డీఎస్పీ మీడియాకు వివరించారు. ఇది ఫేక్ మెసేజ్ గా గుర్తించామని వివరించారు. మెయిల్ చేసిన వ్యక్తి ని గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.