నందికొండ, జూలై 27: బుద్ధవనం బుల్లి తెర, వెండి తెర చిత్రాలు తీయడానికి అనువైన ప్రదేశమని, ఇక్కడ షూటింగ్‌లు చేసే విషయమై తాను టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలతో చర్చిస్తానని బౌద్ధధర్మ ప్రచారకుడు, బాలీవుడ్ నటుడు, క్రికెటర్ గగన్ మాలిక్ పేర్కొన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు గురువారం ఆయన నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించారు.
బుద్ధచరిత వనం, జాతక పార్కు, అవకాన బుద్ధ, స్థూపపార్కు, మహాస్థూపం, ధ్యానమందిరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. సిద్ధార్థ గౌతమ చిత్రంలో గగన్ మాలిక్ బుద్ధుడిగా నటించి ఐక్యరాజ్య సమితి నుంచి ఉత్తమ అవార్డు పొందారని, జీ టీవీ రామాయణంలో రాముని పాత్రలో రాణించి బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యారని తెలిపారు. బౌద్ధ ప్రచారకుడిగా శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లో ఆయన గుర్తింపు పొందారని చెప్పారు. మాలిక్‌కు జ్ఞాపికను అందించి బుద్ధవనం వస్ర్తాలతో సన్మానించారు. బుద్ధవనం విశేషాలను బుద్ధవనం కన్సల్టెంట్, ఎక్సపర్ట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గగన్ మాలిక్‌కు వివరించారు. కార్యక్రమంలో బౌద్ధాభిమాని కేకే రాజా, బుద్ధవనం ఓఎస్డీ సుధాన్‌రెడ్డి, సహాయక శిల్పి శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.