కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.మేడే సందర్భంగా ఆదివారం కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు మంత్రుల నివాసంలో వినోద్‌కుమార్‌తో సమావేశమయ్యారు. వివిధ సమస్యలను వినోద్‌కుమార్‌కు వివరించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టు విభజన జరగకపోవడం వల్ల తెలగాణ రాష్ట్ర కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ఈ కోర్టు విభజన జరగకపోవడం వల్ల లెక్కలేనన్ని కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోకుండా కార్మిక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ఈ కోర్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికలోకం ముందుకు సాగాలని వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు.