హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) :రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చే యాదాద్రి విద్యుత్తు ప్లాంట్‌లో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఈ ప్లాంట్‌లోని రెండు యూనిట్లలోని బాయిలర్లను టీఎస్ జెన్కో అధికారులు మండించారు. మంగళవారం యూనిట్ -1, యూనిట్ -2 ఆగ్జిలరీ బాయిలర్లను జెన్కో అధికారులు వెలిగించారు. ఇక నుంచి ఈ రెండు యూనిట్లలో ట్రయల్ రన్‌ను చేపడతారు. ఆ తర్వాత దశల వారీగా విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభిస్తారు. కాస్త సమయం తర్వాత ఈ రెండు యూనిట్లల్లో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యే అవకాశముంది. కమర్షియల్ ఆపరేషన్స్ తర్వాత గ్రిడ్‌తో అనుసంధానిస్తారు. ఇందుకు రెండు నెలల సమయం పట్టే అవకాశముంది. బాయిలర్ లైటప్ అంటే కొలిమి వెలిగించడమని అర్థం. విద్యుత్తు ఉత్పత్తిలో ఇది మొదటి దశ. విద్యుత్తు ఉత్పిత్తి ప్రక్రియలో భాగంగా బొగ్గును వినియోగించి బాయిలర్లను మండిస్తారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆవిరి ఉత్పత్తి చేసి, ఈ ఆవిరితో ప్లాంట్‌లో బిగించిన టర్బైన్లను తిప్పుతారు. ఈ స్ట్రీమ్ టర్బైన్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతానికి రెండు యూనిట్లల్లో బొగ్గును మండించడంతో బాయిలర్ చిమ్నీ నుంచి పొగలు విరజిమ్ముతూ రెండు యూనిట్లు విద్యుత్తు జనరేషన్‌కు సిద్ధమయ్యాయి.
ఇటీవలే ఈసీ జారీ
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం, వీరప్పగూడెం గ్రామాల్లో టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో యాదాద్రి థర్మల్‌ప్లాంట్‌ను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో యూనిట్‌ను 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం నాలుగువేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా ఐదు యూనిట్లను నిర్మిస్తున్నారు. రూ. 30వేల కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టగా, 2017లోనే ఈ ప్లాంట్‌కు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ ప్లాంట్‌లో వినియోగిస్తున్న టెక్నాలజీ మారడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్జీటీని ఆశ్రయించాయి. ఎన్జీటీ తీర్పుతో ఆఖరుకు ఈ అంశం కేంద్ర పర్యావరణశాఖ చెంతకు చేరింది. ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ప్లాంట్‌కు షరతులతో అన్నిరకాల పర్యావరణ అనుమతులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే టీఎస్ జెన్కో అధికారులు మంగళవారం బాయిలర్లను వెలిగించారు. ఈ ప్లాంట్‌లో నిర్మించే ఐదు యూనిట్ల గడువును టీఎస్ జెన్కో పొడగించింది. ఒక్కో యూనిట్‌ను ఎప్పటి వరకు పూర్తిచేస్తామో ఆయా వివరాలను కేంద్రానికి సమర్పించింది.
హర్షం వ్యక్తంచేసిన టీఎస్‌పీఈఏ
యాదాద్రి విద్యుత్తు ప్లాంట్ లైటప్పై తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసొసియేషన్ (టీఎస్‌పీఈఏ) హర్షం వ్యక్తంచేసింది. ఐదు యూనిట్ల ఈ ప్లాంట్‌లో రెండు యూనిట్లల్లో లైటప్ ప్రక్రియలో భాగస్వామ్యమైన విద్యుత్తు ఇంజినీర్లు, విద్యుత్తు సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ చారిత్మ్రాకత ఘట్టం ఆవిష్కృతమయ్యేందుకు అద్భుతంగా పరిశ్రమించిన వారికి టీఎస్‌పీఈఏ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పీ రత్నాకర్‌రావు, పీ సదానందంలు అభినందించారు.
యూనిట్ గడువు