మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం మేడిగడ్డ గోదావరిలో (Medigadda Barrage) గల్లంతైన ఆరుగురు విద్యార్థుల ( Students Missing ) మృతదేహాలు లభ్యమయ్యాయి. శనివారం అర్ధరాత్రి వరకు గల్లంతైన విద్యార్థుల ఆచూకీ దొరకకపోవడంతో పరిస్థితులు అనుకూలించక గాలింపు నిలిపివేసిన అధికారులు ఆదివారం ఉదయమే మళ్లీ గాలింపు చర్యలను ప్రారంభించారు.
మధ్యాహ్నం వరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. చివరి మూడు మృతదేహాల ఆచూకీ లభించకపోవడంతో మత్స్యకారుల వలలతో గాలించి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను మహాదేవ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈతకు వెళ్లి మృత్యువు ఒడిలోకి చేరిన పిల్లలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
శుభకార్యం కోసం వచ్చి…
మహాదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో పట్టి వెంకటస్వామి కుటుంబంలో ఈ నెల 5న జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చిన పట్టి మధుసూదన్ (18), పట్టి శివ మనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్ణాల సాగర్ (16), మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచెందర్ (17), పసుల రాహుల్ (19) లు మృతి చెందారు.
గల్లంతైన వారికోసం గ్రామానికి చెందిన ఈతగాళ్లతో పాటు అక్కడికి చేరుకున్న కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి గజ ఈతగాళ్లను పిలిపించి గాలించారు. సింగరేణి రెస్క్యూ టీంతో గాలించినా ఆచూకీ దొరకలేదు. ఘటన శనివారం సాయంత్రం 6 గంటలకు జరుగగా 18 గంటల నిరీక్షణ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆడిషనల్ ఎస్పీ నరేశ్ ఆధ్వర్యంలో ఎల్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్. అగ్నిమాపక సిబ్బంది. సింగరేణి రెస్క్యూ టీం, పోలీసులు చేపట్టిన ఆపరేషన్ మృతదేహాలను వెలికితీశారు.
ప్రభుత్వ వైఫల్యమే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
మేడిగడ్డ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంథిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (Putta Madhukar) ఆరోపించారు. ఆదివారం ఆయన మహాదేవ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటంబాలను పరామర్శించారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పక్కన పెట్టిందని, అక్కడ వరద ప్రవాహాం పెరుగుతుందని తెలిసినా కనీస రక్షణ చర్యలు చేపట్టలేదని అన్నారు. దీంతో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించి ప్రతి కుటంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని, అక్కడ ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.