న్యూఢిల్లీ: అయిన వారి మృతదేహాల కోసం, గల్లంతైన వారి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్న పలు కుటుంబాల వారి రోదనలతో న్యూఢిల్లీలోని ఎల్ఎన్జేపీ దవాఖాన మంగళవారం ఉదయం శోక సంద్రంగా మారింది. దవాఖాన శవాగారం ద్వారాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కొందరు తమ వారి ఆచూకీ తెలపాలని దవాఖాన సిబ్బందిని ప్రాథేయపడటం కనిపించింది.
కొందరు వచ్చి, పోయే అంబులెన్స్‌లను చూసి కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు. మార్చురీలో రాత్రి డ్యూటీ పూర్తి చేసిన ఓ ఉద్యోగి మాట్లాడుతూ రాత్రి కనిపించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయన్నారు. ‘కొన్ని దేహాలు గుర్తు పట్టలేనంతగా ఉన్నాయి. కొన్ని కేవలం మాంసపు ముద్దలుగా ఉన్నాయి. చాలా మంది లోపలి అవయవాలు చీలిపోయి లేదా గల్లంతై ఉన్నాయి. ఒక దాని నుండి వేరొకటి వేరు చేయడం కష్టం. అంతగా ఛిద్రమైపోయాయి’ అని అతడు పీటీఐకి తెలిపారు.