హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : స్థాపిత సామర్థ్యం మేరకు జల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయిస్తూ తెలంగాణ సర్కారు జారీచేసిన జీవో34పై ఏపీ, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్‌పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. దీంతో రాష్ర్టాల మధ్య నదీ జలాలను పంపిణీ చేసే అధికారం రివర్ బోర్డులకు లేదని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ పంపిణీ చేసిన వాటాలను పర్యవేక్షించే బాధ్యత మాత్రమే బోర్డులకు ఉంటుందని వివరించింది.
నీటి వాటాలు తేలేవరకూ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేమని తేల్చిచెప్పింది. నీటి పంపిణీ లేనందునే సుదీర్ఘకాలంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే నదీ జలాల పునఃపంపిణీకి కేంద్రం సెక్షన్ 3 మార్గ దర్శకాలను జారీ చేసిందని గుర్తుచేసింది. ఆ మేరకు ట్రిబ్యునల్ ఎదుట వాదనలు కొనసాగుతున్నాయని తెలిపింది. దీంతో తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది.