హైదరాబాద్: హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను (Bus Bhavan) ఆటో కార్మికులు (Auto Workers) ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎంఎస్ (BMS) ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడిలో పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) వల్ల తమకు గిరాకీ పడిపోయిందని కార్మికులు, గతంలో రోజుకు రూ.1000 నుంచి రూ.1500 సంపాదించేవారమని, ఇప్పుడది రూ.400లకు పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని, కనీసం కిస్తీలు కూడా కట్టలేకపోతున్నామని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయానికి రోజు రూ.1000 వరకు గండి పడిందని బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, వారికి ఇబ్బంది కలుగకుండాచర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇదే విషయమై అన్ని జిల్లాల్లో ఆటో కార్మికులు రోడ్లెక్కుతున్న విషయం తెలిసిందే.