హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సిగాచి పరిశ్రమలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను హరించిన భారీ పేలుడుపై దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆ ప్రమాద ప్రాంతాన్ని అనేక శాఖల ఉన్నతాధికారులు తనిఖీ చేసి నివేదికలు సమర్పించాల్సి ఉండగా కేవలం ఆ ఫ్యాక్టరీ అధికారి మాత్రమే తనిఖీ చేయడం ఏమిటని మండిపడింది. కార్మిక శాఖ అధికారులు, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నిలదీసింది. ప్రభుత్వ తీరును బట్టే సిగాచి పరిశ్రమ యాజమాన్యం ఎంతబలంగా ఉన్నదో తేటతెల్లమవుతున్నదని, ఆ కర్మాగారంలోని అసంఘటిత కార్మికులు తమ గోడును యాజమాన్యానికి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూన్ 30న సిగాచి కర్మాగారంలో భారీ పేలుడు జరగడంపై అధికారులు సమర్పించిన దర్యాప్తు నివేదికను మంగళవారం హైకోర్టు పరిశీలించింది. ఈ సందర్భంగా జరిగిన విచారణకు డీఎస్పీ ఎస్ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తదితర అధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. వారి వివరణపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
ఆ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు పరిమితికి మించి ఉన్నపటికీ పట్టించుకునేవారే లేకపోయారని, 90 మంది పనిచేయాల్సిన ఆ కర్మాగారంలో 50 మంది మాత్రమే ఉన్నారని ఆక్షేపించింది. సిగాచి పరిశ్రమలో పేలుడు రాత్రికి రాత్రి తలెత్తిన లోపాల ఫలితం కాదని, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం తర్వాతైనా అధికారులు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టకపోవడం శోచనీయమని పేర్కొన్నది. సిగాచి ఘటన తర్వాత కూడా స్పందించని అధికారులపై వేటువేస్తేనే పరిస్థితులు కొలికి వస్తాయని, అలా చేయ డం ద్వారానే ఇతర అధికారులకు గుణపాఠ సందేశం పంపినట్టు అవుతుందని అభిప్రాయపడింది.
తాము లేవనెత్తే సందేహాలకు సమాధానం చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అందుకు 2 వారాల గడువు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారి (అమికస్ క్యూరీ)గా న్యాయవాది డొమినిక్ ఫెర్నాండెజ్‌ను నియమిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు, నివేదికల ప్రతులను అమికస్ క్యూరీకి అందజేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.