వేల్పూర్, జూలై 9: కాంగ్రెస్ ఏడాదిన్నరపాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని చెప్పారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం బీజేపీ బాల్కొండ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఎక్కల్దేవి సురేశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరగా వారికి ప్రశాంత్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే తప్ప.. కాంగ్రెస్ చేపట్టిన పనులేమీ కనిపించడంలేదని పేర్కొన్నారు. తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.