హైదరాబాద్ : మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ దిగజారుడు రాజకీయాలకు తెరదీసిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ చౌరస్తాలో నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయపార్టీ దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసేవారని ఇప్పుడు బీజేపీ ఆ నీఛ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి దుష్ట రాజకీయాలపై తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా చివరికి మునుగోడులో టీఆర్ఎస్దే విజయమని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి , జీటీఎస్ దేవాలయం చైర్మన్ చిన్న రమేశ్ తదితరులు పాల్గొన్నారు.