Grok | న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 : పేద, మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు.. రూ.వేల కోట్లు తీసుకొని విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ల అప్పులను మాత్రం రైటాఫ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో బ్యాంకులు ఇప్పటివరకు రూ.16.35 లక్షల కోట్లను రైటాఫ్ చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వమే ఒప్పుకొన్నది. అయితే, బ్యాంకులను ముంచి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్లు ఎవరు? ఎవరి హయాంలో వీరందరూ విదేశాలకు పారిపోయారు? ఎగవేతదారులు అలా వెళ్తుంటే, ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? వంటి పలు సందేహాలు సామాన్యులకు కూడా వచ్చాయి. ఇవే ప్రశ్నలను ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను పలువురు నెటిజన్లు అడిగారు. ఈ ప్రశ్నలకు ‘గ్రోక్’ కుండబద్దలు కొట్టినట్టు సమాధానాలు ఇవ్వడం గమనార్హం.
బ్యాంకుల నుంచి పెద్దయెత్తున రుణాలు తీసుకొని మోదీ ప్రభుత్వ హయాంలో భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన వారి జాబితా ఇవ్వాలంటూ ‘గ్రోక్’ను ఓ నెటిజన్ కోరాడు. దీనికి ‘గ్రోక్’ స్పందిస్తూ.. మోదీ హయాంలో పలువురు కార్పొరేట్లు ఎగవేతలకు పాల్పడి విదేశాలకు పారిపోయినట్టు వెల్లడించింది. రూ.9,000 కోట్లను రుణంగా తీసుకొని 2016 లో విజయ్ మాల్యా యూకేకు పారిపోయినట్టు ‘గ్రోక్’ తెలిపింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ పీఎన్బీకి రూ.14 వేల కోట్లను ఎగనామం పెట్టి 2018లో వరుసగా యూరప్, ఆంటిగోకు పరారయ్యారని ‘గ్రోక్’ వెల్లడించింది. సందేశర ఫ్యామిలీ (నితిన్, చేతన్, దీప్తి) మొత్తంగా రూ.5,000 కోట్లను ఎగవేసి 2018లో విదేశాలకు పారిపోయినట్టు ‘గ్రోక్’ తెలిపింది. సందేశర ఫ్యామిలీ కేసుకు సంబంధించే మరో ఆర్థిక నేరగాడు హితేశ్ పటేల్ రూ.8,100 కోట్ల రుణాలను బ్యాంకులకు చెల్లించకుండా 2018-19లో విదేశాలకు పరారైనట్టు వివరించింది. ఈ ఎగవేత కేసుల కారణంగా ఆర్థిక నియంత్రణ ఎలా ఉండాలి? రుణాల వసూలుకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు ఏమిటన్న అంశంపై దేశవ్యాప్తంగా పెద్దయెత్తున చర్చ కూడా జరిగినట్టు వివరించింది. ఇక, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు మోదీ హయాంలోనే విదేశాలకు పారిపోయారా? అన్న మరో ప్రశ్నకు ‘గ్రోక్’.. అవునంటూ సమాధానమిచ్చింది. యూపీఏ హయాంలో రుణాలు తీసుకొన్నప్పటికీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ స్కామ్‌లు వెలుగుచూశాయని, మోదీ ప్రభుత్వం ఉన్నప్పుడే మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీ విదేశాలకు పారిపోయారని ‘గ్రోక్’ తేల్చిచెప్పింది. ఎలాంటి వివరాలను వడబోయకుండా తాను ఈ సమాధానం ఇస్తున్నట్టు వివరించింది.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారు విదేశాలకు పారిపోవడానికి కారణం వారిని సకాలంలో దర్యాప్తు సంస్థల అధికారులు అరెస్ట్ చేయకపోవడమేనని గత ఏడాది ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ‘గ్రోక్’ను ఓ నెటిజన్ ప్రశ్నించగా.. కోర్టు వ్యాఖ్యలు సరైనవేనని చాట్‌బాట్ సమాధానమిచ్చింది. అధికారులు ముందుగా అరెస్ట్ చేస్తే, ఎగవేతదారులు అసలు దేశం విడి చి పారిపోయే పరిస్థితే ఉండేది కాదని ‘గ్రోక్’ అభిప్రాయపడింది. ‘విజయ్ మాల్యా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడానికి సూత్రధారి ఎవరు?’ అని మరో నెటిజన్ ‘గ్రోక్’ను ప్రశ్నించాడు. దీనికి చాట్‌బాట్ సమాధానమిస్తూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వ్యవస్థాగత వైఫల్యం వల్లే మాల్యా దేశాన్ని విడిచిపెట్టి పారిపోగలిగాడని ‘గ్రోక్’ తేల్చిచెప్పింది. మాల్యా కేసులో లుకౌట్ నోటీసులను మార్చారని, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మాల్యా మధ్య భేటీ జరిగిందంటూ కొన్ని వార్తలు వచ్చాయని, అయితే, వాటిలో నిజమెంత అనేది ఇంకా తెలియరాలేదని గ్రోక్ తెలిపింది.
బ్యాంకులకు వేల కోట్లను ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ గుజరాతీలా లేదా బెంగాలీలా? ప్రధాని మోదీకి లేదా బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వీరికి సంబంధాలు ఉన్నాయా? అంటూ మరో నెటిజన్ గుజరాతీ భాషలో ‘గ్రోక్’ను ప్రశ్నించాడు. దీనికి చాట్‌బాట్ స్పందిస్తూ.. మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ ఇద్దరూ గుజరాతీలని సమాధానమిచ్చింది. ప్రధాని మోదీతో వీరికి సంబంధాలు ఉన్నట్టు అభిప్రాయపడింది. లలిత్ మోదీ రాజస్థాన్‌కు చెందిన వాడన్న ‘గ్రోక్’.. మోదీతో గాని లేదా మమతతో గాని ఆయనకు గల సంబంధాల గురించి పెద్దగా తెలియదని పేర్కొంది. దేశంలో అతి పెద్ద దొంగ ఎవరన్న మరో నెటిజన్ ప్రశ్నకు ‘గ్రోక్’ స్పందిస్తూ.. నీరవ్ మోదీ పేరును చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,578 కోట్లను ఆయన ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడని ‘గ్రోక్’ వివరించింది.