హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్న మెదడువాపు వ్యాధి నియంత్రణలో బీజేపీ పాలిత రాష్ర్టాలు విఫలమవుతున్నాయి. 2021లో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే నమోదుకావడం ఇందుకు నిదర్శనం. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే లోక్సభలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2021లో దేశవ్యాప్తంగా 15 రాష్ర్టాల్లో మెదడువాపు వ్యాధి కేసులు నమోదయ్యాయి. వాటిలో 7 బీజేపీ పాలిత రాష్ర్టాలే. తెలంగాణ సహా మిగతా రాష్ర్టాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మెదడువాపు వ్యాధి నివారణకు దేశంలో 2006 నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. అయినా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వ్యాక్సిన్లు వేయడంలో అధికార యంత్రాంగం విఫలమవడంతో పిల్లలు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారు.
అగ్రస్థానంలో అస్సాం
దేశంలో అత్యధికంగా మెదడువాపు వ్యాధి కేసులు నమోదైన రాష్ర్టాల జాబితాలో అస్సాం అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మొత్తం 218 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ (180 కేసులు), ఉత్తరప్రదేశ్ (153) ఉన్నాయి.