హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుకు పార్టీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రామచందర్రావు శనివారం పార్టీ పెద్దలను కలిశారు. అయితే, పార్టీ పెద్దల ముందు ఆయన ఉంచిన ప్రతిపాదనలను పక్కనపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆఫీస్ బేరర్ల పోస్టుల సంఖ్య పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అధ్యక్షుడి ప్రతిపాదనలను అధిష్ఠానం తిరస్కరించింది. అధికార ప్రతినిధులు సైతం జంబో టీం ఉండొద్దని తేల్చిచెప్పింది. పరిమిత సంఖ్యలోనే ఉండాలని సూచించింది. హైకమాండ్ నిర్ణయంతో రామచందర్రావు కంగుతిన్నట్టు తెలిసింది.