హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాబోయే లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి బరిలో దిగుతానని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటించుకుని, సన్నాహక సమావేశాలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అని ఎక్కడా చర్చ జరగలేదు. ఇలాంటి వార్తలు బేస్‌లెస్’ అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 7,8 తేదీల్లో పార్టీ నేతల సమావేశం నిర్వహిస్తామని, లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ కమిటీలను నియమిస్తామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, జనసేనతో పొత్తు ఉండదని స్పష్టంచేశారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ వరంగల్ నుంచి పోటీ చేస్తారనే విషయం తమ పార్టీ ఇప్పటివరకు చెప్పలేదని, అలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు. దీంతో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ హైకమాండ్‌తో తాము చర్చలు జరుపుతున్నామని జనసేన నేతలు చెప్తున్నారు. తెలంగాణ నుంచి ఎమ్మార్పీఎస్ నాయకత్వానికి టికెట్టు ఇస్తామని చెప్తే బాగుండేదని మందకృష్ణ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ తనకు కరీంనగర్ టికెట్ ఇవ్వకపోతే మల్కాజిగిరి నుంచి పోటీచేస్తానంటూ ఈటల రాజేందర్ తన అనుచరులతో చెప్పుకోవడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఓడిపోయిన వ్యక్తికి మళ్లీ ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ టికెట్‌ను జితేందర్‌రెడ్డి, డీకే అరుణ ఆశిస్తున్నారు. డీకే అరుణ ఆ టికెట్ తనకేనని చెప్పుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.