హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సినీనటుడు అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు ఏమాత్రం భావ్యం కాదని బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ తప్పుబట్టారు. విద్వేషపూరితంగా, కక్షగట్టినట్టుగా వ్యవహరించడం ఏమాత్రం మంచిదికాదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి, మజ్లిస్ పార్టీ కుట్రపూరితంగానే అల్లు అర్జున్ను, సినీపరిశ్రమను అపఖ్యాతి పాలు చేసేందుకు అసెంబ్లీని వేదికగా మలచుకున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరముందా? అని తెలుగు రాష్ర్టాల ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. తెలుగు సినీపరిశ్రమ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని, తెలుగు ప్రజలు గర్వించే సినిమాలు వస్తున్నాయని చెప్పారు.