తెలంగాణలో బీజేపీ పని దాదాపు ఖతమైంది. హైదరాబాద్ పరిధిలో పట్టున్న ఆ పార్టీకి.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాత్రం చావుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఈ ఘోర ఓటమిని బీజేపీ మూటగట్టుకున్నది. దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని ఈ ఫలితం రుజువుచేసింది. లోక్ సభ ఎన్నికల్లో ఏదో ఊపుతో వచ్చిన ఫలితాలను చూపించి ఇన్నాళ్లూ గప్పాలకుపోయిన నేతలకు గర్వభంగం తప్పలేదు. జూబ్లీహిల్స్ పరిధిలో ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో మూడోవంతైనా ఇప్పుడు లభించలేదు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ (BJP) నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By-Election) బొక్కబోర్లా పడ్డారు. తాము గెలవకపోయినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ మాత్రం గెలవొద్దు. కాంగ్రెస్సే గెలవాలనే రహస్య ఎత్తుగడ, ఉప ఎన్నికలో పోటీచేసినట్టే చేసి అస్త్రసన్యాసం చేసిన ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. శుక్రవారం వెల్లడైన ఉపఎన్నిక ఫలితాల్లో ఇదే నిర్ధారణ అయ్యింది. 4 లక్షలపైగా ఓట్లర్లున్న ఈ నియోజకవర్గంలో బీజేపీ కేవలం 17,061 ఓట్లుతో సరిపెట్టుకున్నది. ఆ పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను కూడా దక్కించుకోలేక చతికిలపడ్డారు. కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోవడం చర్చనీయాంశమైంది.
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా.. బైపోల్లో తుస్
ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇదే నియోజవర్గ ప్రజలు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25,866 ఓట్లు వేశారు. రెండేండ్లలో బీజేపీ ఓట్లు 8 వేలకుపైగా తగ్గడం గమనార్హం. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 64,673 ఓట్లు వచ్చాయి. కానీ, ఇప్పుడు 17 వేల ఓట్లే వచ్చాయి. అంటే మూడో వంతు కూడా రాలేదన్నమాట. బీజేపీ-కాంగ్రెస్ మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఫలితంగా ఈ ఓట్లన్నీ కాంగ్రెస్‌కే మళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే కాంగ్రెస్‌కు ఊహించని విజయం వరించిందని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ గల్లంతుపై మాట్లాడటానికి బీజేపీ నేతలు మొహం చాటేస్తూ.. బీహార్, ఇతర రాష్ర్టాల ఉప ఎన్నికల గురించి మాటాడుతున్నారు.
ఆదినుంచీ పరోక్ష సహకారం
అభ్యర్థి ప్రకటన మొదలు, ప్రచారం, పోలింగ్ వరకు కేవలం కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా బీజేపీ వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి గతంలోనూ పోటీచేశారు. అయితే, అభ్యర్థి ప్రకటన విషయంలో బీజేపీ పెద్దలు జాప్యం చేశారు. బీసీ వాదం వినిపించినా బీసీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం, ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌కు సహరించారని రాజకీయ విశ్లేషకులుంటున్నారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, కావాలనే రెడ్డి అభ్యర్థిని నిలబెట్టారనే వాదన వినిపిస్తున్నది. ఇక కిషన్‌రెడ్డి మినహా ముఖ్యనేతలెవరూ ప్రచారానికి రాలేదు. ఎంపీ ధర్మపురి అరవింద్ జూబ్లీహిల్స్ వైపే చూడలేదు. స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించినా ఒక్కరూ వచ్చింది లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసినా ప్రజలు ఖాతరు చేయలేదు. బీఆర్ఎస్కు పరిస్థితి అనుకూలంగా ఉన్నదన్న టాక్ వినిపిస్తున్న దశలో పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ మణిపూర్ నుంచి అకస్మాత్తుగా వచ్చి ప్రచారం చేశారు. ముస్లిం ప్రాబల్యప్రాంతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్‌ను గెలిపించిన బండి
మొత్తంగా పరిస్థితి చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ‘కమలహస్తం’ వికసించినట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్తున్నారు. బండి సంజయ్ చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు మేలుచేసిందని చెప్తున్నారు. బోరబండ, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో ప్రచారం చేసిన సంజయ్ పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఎన్నిక మొలతాడు ఉన్నోళ్లకు.. మొలతాడు లేనోళ్లకు పోటీ. ఈ ఎన్నికల్లో 80 శాతమున్న హిందువులు గెలుస్తరా? లేక 20 శాతమున్న ముస్లింలు గెలుస్తరా? హిందువుల పక్షాన బీజేపీ, ముస్లింల పక్షాన కాంగ్రెస్ ఉన్నది’ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ‘తలనైనా నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకోను (టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా) నేను హిందువును, నమాజ్ చేస్తూ నటించను’ అంటూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. ఇది ఈ నియోజకవర్గంలోని ముస్లింలను ఆందోళనకు గురిచేసింది. అంతేకాదు, ముస్లింలంతా కాంగ్రెస్‌కు ఓటు వేసేవిధంగా బండి సంజయ్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రేరేపించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీంతో కాంగ్రెస్‌కు అనుకోని విజయం వరించిందని భావిస్తున్నారు. మొత్తంగా బీజేపీ తాను ఆత్మహత్య చేసుకొని, కాంగ్రెస్‌ను గెలిపించిందనే విమర్శలను ఎదుర్కొంటున్నది.