మహబూబాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్ర హక్కులను కాలరాయడమే కాకుండా రాజ్యాంగాన్ని అవమానించే విధంగా విభజన హామీలను ధిక్కరిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించి తీరాలని, లేకుంటే తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ నిర్వహించిన ఒక రోజు ఉక్కు దీక్షకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కంటే బయ్యారంలో మంచి ఖనిజం ఉన్నదని సర్వేలు చెప్తుంటే.. ఫ్యాక్టరీ ఏర్పాటు వీలుకాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పడం రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న ప్రేమ ఏపాటిదో తెలుస్తున్నదని చెప్పారు. రాష్ట్ర హక్కులను సాధించకుంటే, బీజేపీ ఎంపీలకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎవరి భిక్ష కాదని.. మన హక్కు అని ఉద్ఘాటించారు. ఇందుకోసం రానున్నరోజుల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపడుతామని, అవసరమైతే ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కులం, మతం పేరిట ప్రజలను విభజిస్తూ బీజేపీ ఓట్లు దండుకొంటున్నదని దుయ్యబట్టారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి అడ్డుపడేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆదివాసీ, గిరిజన బిడ్డల ఉపాధికి ఉరివేసేలా ఉన్నాయని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపుల్లలు వేస్తే.. చరిత్రలో నిస్సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి నిలిచిపోతారన్నారు. బయ్యారం పోరాటాల గడ్డ అని.. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం వచ్చిందనే విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సౌకర్యాలు లేవంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. వేదికపై ఉన్న నాయకులు బయ్యారం రాళ్లను చేతపట్టుకొని ‘బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు’ అంటూ నినాదాలు చేశారు. దీక్షలో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, రేగా కాంతారావు, రాములునాయక్, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ అంగోతు బిందు, మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.