హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 /నిర్మల్ అర్బన్/బంజారాహిల్స్/మాదన్నపేట: బీజేపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కన్వీనర్ సతీశ్ చంద్రను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి కించపరిచేలా పోస్టులు సృష్టించి సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తిపై ఇటీవల ఫిర్యాదు అందగా.. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఇదంతా సతీశ్‌చంద్ర చేస్తున్నాడని తేలింది. మంగళవారం ఉదయం ప్రత్యేక బృందం నిర్మల్‌కు చేరుకొన్నది. పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉండే తన తల్లి వద్దకు వచ్చిన సతీశ్‌చంద్రను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. సతీశ్‌చంద్ర సాప్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు.
అర్వింద్‌పై బంజారాహిల్స్‌లో కేసు
సీఎం కేసీఆర్ ఫొటోలను మార్ఫింగ్చేసి అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పో స్టు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఇటీవల అర్వింద్‌పై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. పోలీసులు ఐపీసీ 504, 505(2), 153ఏ తోపాటు 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేసేవారిని ఇకపై వదిలిపెట్టబోమని వై సతీశ్‌రెడ్డి హెచ్చరించారు.
మాదన్నపేటలో అట్రాసిటీ కేసు
సీఎం కేసీఆర్‌పై అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టినందుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై మాదన్నపేట పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. స్థానికుడైన సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.