హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే.. కాం గ్రెస్ తల్లి అనే భావన కలుగుతున్నదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. బతుకమ్మకు బదులుగా కాంగ్రెస్ గుర్తు ‘హస్తం’ చూపించేలా ఉన్నదని పేర్కొన్నారు. అందుకే ఆ విగ్రహం కాంగ్రెస్ తల్లి అనే భావన ప్రజల్లో కలుగుతున్నదని చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిహ్నాలు, విగ్రహాలు మార్చుకుంటూ పోతే ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రి శ్రీధర్‌బాబుకు బీజేపీ ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి మధ్య ప్రొటోకాల్ వివాదం రచ్చగా మారింది. ‘మీ కుర్చీలో కూర్చుంటేనే మీకు అంత ఇబ్బం ది అయితే.. మరి మా నియోజకవర్గాల్లో మమ్మల్ని ఎమ్మెల్యేగా గుర్తించడం లేదు. అప్పుడు మాకెలా ఉంటుందో ఆలోచించండి’ అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రొటోకాల్ అంశాన్ని ప్రస్తావించారు. తాను శాసనసభ సభ్యుడిని కాదా, ప్రజలు తనను గెలిపించలేదా, మరెందుకు ఎమ్మెల్యేగా తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని ఇదే అంశంపై ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి నిలదీశారు. ఐడీ కార్డును విసిరేసి అసహనం వ్యక్తంచేశారు.
సర్కారువి ఉల్టా ఆలోచనలు: పాల్వాయి
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ ఉల్టా ఆలోచనలు చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశంపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం కిరీటం తొలగించి సాదాసీదాగా రూపొందించిందని, బతుకమ్మ కూడా లేదని, ఉల్టా ఆలోచనలు చేస్తున్నదని విమర్శించారు. విగ్రహాలను ఏర్పాటు చేయడం, పేర్లు మార్చడం గాకుండా ప్రభుత్వం ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారించాలని చురకలంటించారు.
బతుకమ్మ ఉంటే బాగుండేంది: పాయల్
తెలంగాణ తల్లి విగ్రహంపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటే బాగుండేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గేయం, చిహ్నం, విగ్రహాన్ని మార్చారని తెలిపారు. అన్నీ మారుస్తున్న సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బం ది పెట్టే 317 జీవోను కూడా మార్చాలని కో రారు. నిర్ణయాలు తీసుకునే ముందు అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.
ప్రొటోకాల్ ఉల్లంఘన ఫిర్యాదు ఏమైంది?
తన నియోజకవర్గంలో మంత్రి, కలెక్టర్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని 8 నెలల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని వెంకటరమణారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై స్పీకర్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు త్వరలోనే ప్రివిలేజ్ కమిటీ సమావేశం నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ఈ అంశంపై తర్వాత చర్చిద్దామని తెలిపారు. దీంతో వెంకట్రామిరెడ్డి.. ప్రొటోకాల్ అంశంపై సభలో కచ్చితంగా చర్చించాల్సిందేనని పట్టుబట్టారు.