BJP Leader Fire on Arvind | మల్లాపూర్, జూలై 17: ‘అర్విందన్నా..మీరు నిజాంబాద్ ఎంపీగా ఎందుకు గెలిచిండ్రన్నా..కార్యకర్తలు, రైతుల కోసం ఏం జేసిండ్రు మీరు..తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది.. పార్లమెంట్లో చేసిందేంటో చెప్పకపోతిరి’.. అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి దేశెట్టి కిరణ్ సూటిగా ప్రశ్నించాడు.. ఆయన సోమవారం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. బీజేపీలో కలకలం రేగింది.
ఆయన మాటల్లోనే.. అర్వింద్ అన్నా ఏ ఉద్దేశ్యం కోసం గెలిచారు. ఓ కార్యకర్తలకు కరెక్ట్‌గా పనిచేయలేరు. కనీసం రైతులకు పని చేయలేక పోతున్నారు.. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల సర్వేలో అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణలో ఏమి చేసిందో చెప్పలేని దయనీయస్థితిలో ఉన్నది.. రైతులంతా ఒక్కటై కవితపై మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు.. పార్లమెంట్ పరిధిలో 20 మంది ఎంపీటీసీలు గెలిచారు.. వీరికి మీరు ఎంపీగా గెలిచి గీన్ని రోజులైన ఎన్ని నిధులు ఇచ్చారు` అని ప్రశ్నించారు.
`మా ఊరు రాఘవపేట.. స్థానిక కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సొంతూరైనప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా సొంతంగా ఖర్చుపెట్టుకొని కొట్లాడం.. కేసులు నమోదై జైలుకు వెళ్లాం. ఇప్పటికి కేసులు నమోదైన బీజేపీ కార్యకర్తల పేర్లు మీకు తెలుసా? కనీసం మమ్మల్ని మాట్లాడించినా? ప్రజలు కరెక్ట్‌గా ఉన్నారని, నాయకునిగా ఓ ఎంపీగా మీరు ఫెయిల్ అయ్యారు.. నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను ఎందుకు పోత్సహిస్తున్నావో అర్ధం కావడం లేదన్నారు. కాగా ఈ వీడియోను బీజేపీ నాయకులే సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం.