హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టుపై తాము ముందుకు వెళ్లడాన్ని ఎవ రూ వ్యతిరేకించడం లేదని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్రంలోని బీజేపీ నేతల మౌనమే బలాన్ని చేకూరుస్తున్నది. బీజేపీకి గత ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలను కట్టబెట్టినా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ప్రజల్లో ఇప్పటికే చర్చకొనసాగుతున్నది. ప్రస్తుతం బనకచర్ల అంశంపైనా బీజేపీ అనుసరిస్తున్న తీరు మరింత అగ్గిరాజేస్తున్నది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీల తీరుపై తెలంగాణ సమాజంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పంపడం, అంతేవేగంగా ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్రాజెక్టుపై ఉరుకులు పరుగులు పెట్టడం, మరోవైపు తెలంగాణ గల్లీ బీజేపీ నేతలు నోరెత్తకపోవడంపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
రెండు రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడమేమిటని తెలంగాణ మేధావులు నిలదీస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై పొరుగు రాష్ర్టాల్లోని బీజేపీ ప్రభుత్వాలను శాసించి నోరుమెదపకుండా చేస్తున్నదని మండిపడుతున్నారు. ప్రాజెక్టును వ్యతిరేకించిన కేంద్ర జల్‌శక్తిశాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ను సైతం నోరుమూయించిందని వివరిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పంపి కట్టిపడేసిందని చెప్తున్నారు. ప్రాజెక్టుపై ఢిల్లీ బీజేపీ ఏకంగా ఆదేశాలు జారీ చేయడం, తెలంగాణ గల్లీ బీజేపీ ఎంపీలు గీత దాటకుండా మౌనం దాల్చడంపై మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవా? అని నిలదీస్తున్నారు.
కేంద్రానికి లేఖలు రాయాలె..
కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో 8మంది ఎంపీలు ఉన్నారని, ఇకనైనా బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని కోరుతూ ఇరుపార్టీల ఎంపీలంతా కేంద్రానికి స్వయంగా లేఖలు రాయాలని తెలంగాణ నీటిరంగ నిపుణులు, మేధావులు, ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆ పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రయోజనాలతో ఆటలాడితే ఆ రెండు పార్టీలకు మళ్లీ గుండుసున్నాలు ఖాయమని హెచ్చరిస్తున్నారు.