BJP | కడ్తాల్, జూన్ 6 : వాట్సాప్ గ్రూపులో తన ఫొటోలు తొలగించారంటూ ఓ బీజేపీ నాయకుడు ఇద్దరిని హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన బీజేపీ నేత జల్కం రవి కడ్తాల్ సమీపంలోని బటర్ఫ్లై సిటీ వెంచర్లో ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్ ఎస్టే ట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఈ నెల 4న విల్లాలో జరుపుకొన్న తన పుట్టిన రోజు ఫొటోలను రవి తన గ్రామ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. అధిక సంఖ్యలో ఫొటోలు పెట్టడంతో గ్రామానికి చెందిన శేషగారి శివగౌడ్(27), గుండెమోని శివగౌడ్ (25) అభ్యంతరం వ్యక్తం చేయడమేగాక ఫొటోలను గ్రూప్ నుంచి తొలగించారనే నెపంతో రవి బుధవారం సాయంత్రం తన విల్లాకు వారిని పిలిపించుకున్నాడు.
ఆ విల్లాలో రవితోపాటు ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లికి చెందిన బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్ కూడా ఉన్నాడు. నలుగురు కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో ఫొటోల తొలగింపు విషయమై వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమం లో ఆ ఇద్దరు యువకులపై రవి, రాజుగౌడ్ పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపి, విల్లాకు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన..
బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గోవిందాయిపల్లి గ్రామస్థులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రెండు గంటలకుపైగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి.