లక్షెట్టిపేట, సెప్టెంబర్ 20 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు అజ్మీరా హరినాయక్‌ను ఫోర్జరీ సంతకాల కేసులో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లక్షెట్టిపేటలో ఏసీపీ ప్రకాశ్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్లీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌రావు అనే పట్వారి 1998లో సుమారు 7.26 గుంటల భూమిని తనకు అమ్మినట్టు అజ్మీరా హరినాయక్ దొంగ పత్రాలు తయారు చేశాడు.
ఆపై ఆ భూమిని కబ్జా చేశాడు. కానీ, పట్వారి ఆ భూమిని 1990లోనే తన నలుగురు కుమారులకు పట్టా చేశాడు. ఈ క్రమంలో భూమి వద్దకు వస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని అజ్మీరా హరినాయక్ పలుమార్లు ఆయన కుమారులను బెదిరించాడు.
ఈ క్రమంలో దొంగ పత్రాలు పట్టుకొని తమను బెదిరిస్తున్నాడంటూ పట్వారీ కొడుకు మురళీధర్‌రావు అజ్మీరా హరినాయక్‌పై దండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో గత ఆగస్టు 17న ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పట్వారి చదువుకున్న వ్యక్తి కావడం, ఫోర్జరీ పత్రాలపై వేలి ముద్రలు ఉండటం.. సాక్షులుగా ఉన్న వారిలో ఏ ఒక్కరు బతికి లేకపోవడంతో పక్కగా ఫోర్జరీ చేసినట్టు తేల్చారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని చీటింగ్, ఫోర్జరీతోపాటు మరికొన్ని సెక్షన్ల కింది కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే సమారు ఏడు కేసులు ఉన్నాయని, ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలిసింది.