సత్తుపల్లిటౌన్, జూన్ 17 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని మెగా ఫుడ్‌పార్క్ భూములను ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నదో బయటకు లాగుతామని స్పష్టంచేశారు. ‘ఫుడ్‌పార్క్‌లో భూముల లూటీ’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి బుగ్గపాడులోని ఫుడ్‌పార్క్‌ను సందర్శించారు.
అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం సత్తుపల్లిలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి కోసం, స్థానిక రైతులకు అండగా నిలుస్తుందనే ఉద్దేశంతో రూ.109.50 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఫుడ్పార్ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ భారీ అక్రమాల వెనుక ఈ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతల ప్రమేయం స్పష్టంగా కన్పిస్తున్నదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ద్వారా దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.