ఆదిలాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆయన దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన నేత. ఓ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బాధ్యతగల పదవిలో ఉండి కూడా ఓ దళిత మహిళా ఎస్సై పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. స్థాయి దిగజారి దుర్భాషలాడాడు.. భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్. జైనథ్ మండలం ఆనందపూర్‌కు చెందిన విశాల్ అనే వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆదివారం పాయల్ శంకర్, ఆ పార్టీ నాయకులు జైనథ్ ఠాణా ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకొని వచ్చిన ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. డీఎస్పీతో వాగ్వాదానికి దిగటమేకాకుండా అక్కడి దళిత మహిళా ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
‘ఆ ఎస్సై.. ఇసుక, గుట్కా, మట్కా మాఫియాలా వ్యవహరిస్తున్నదని, రేపు అది బ్రోతల్ హౌస్ నడుపుతది..’ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై మహిళా, ఐక్య దళిత సంఘాలు భగ్గుమన్నాయి. నిర్మల్-ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై తెలంగాణ చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టారు. పేద దళిత కుటుంబానికి చెందిన ఎస్సైపై నిరాధార ఆరోపణలు చేయటమేకాకుండా, వ్యక్తిగత దూషణలకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నాయకులు మహిళలపై కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దళిత పోలీసు అధికారిని అసభ్య పదజాలంతో దూషించిన పాయల్ శంకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు డీఎస్పీ వెంకటేశ్వర్రావుకు ఫిర్యాదు చేశారు.