BJP | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లో టికెట్ల కేటాయింపు తరువాత అసంతృప్తి చెలరేగితే దానిని సొమ్ము చేసుకోవాలని ఆశ పడ్డ బీజేపీకి తీవ్ర నిరాశే మిగిలింది. వాస్తవానికి బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 20 నుంచి 25 నియోజకవర్గాలకు మించి అభ్యర్థులు లేరు. దీంతో మిగతా నియోకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి ఎవరైనా వలస వస్తారేమోనని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్లో సిట్టింగ్‌లను భారీగా మా ర్చుతారని, ఒకవేళ సిట్టింగ్‌లకే ఇచ్చినా టికెట్ కోసం ఆశపడ్డ ఇతర నేతలు అసంతృప్తితో బయటికి వస్తారని, అలాంటివారిని బీజేపీలో చేర్చుకొని టికెట్లు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం భావించింది.
Koneru Satyanarayana
సీఎం కేసీఆర్ సోమవా రం 115 మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఎక్కడా అసంతృప్తి కనిపించకపోవంతో బీజేపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. తమ పార్టీలో కేవలం నిజామాబాద్ జిల్లాలో పార్టీ మండలాధ్యక్షులను మార్చితేనే నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి నానా హంగామా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటిది బీఆర్ఎస్ పార్టీలో 115 నియోజకవర్గాల్లో అసంతృప్తి లేకపోగా, పండుగ వాతావరణం కనిపించడంపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వలసలు వచ్చే పరిస్థితి లేదని తమ ఆశలన్నీ సమాధి అయ్యాయని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తం నియోజకవర్గాల్లో కనీసం మూడింట ఒక వంతు కూడా అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చేరికల కమిటీలు, ఎన్నికల నిర్వహణ కమిటీలు, వాటి చైర్మన్లు ఇప్పుడేమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీకి కోనేరు గుడ్‌బై
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) బీజేపీకి గుడ్‌బై చెప్పారు. తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసి బీఆర్ఎస్లో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తనతోపాటు యువమోర్చా, కిసాన్‌మోర్చా బాధ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా బీఆర్ఎస్లో చేరతారని చెప్పారు.
సత్యనారాయణ తండ్రి కోనేరు నాగేశ్వరరావు గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉండేది. కోనేరు సత్యనారాయణ గతంలో కొత్తగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ తరువాత బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఖమ్మం పర్యటనకు ముందే ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడి రాజీనామా చేయడంతో బీజేపీకి పెద్ద షాక్ తగిలినట్టయింది.