హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మునుగోడులో ఓటమి తప్పదని తేలిపోవటంతో బీజేపీ నేతలు తెరవెనుక కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవటంతో కార్యకర్తలు, నేతల్లో నైరాశ్యం ఆవహించింది. దీంతో ఏం చేసైనా సరే పరిస్థితిని తమవైపు తిప్పుకోవాలని భారీ కుట్రకు తెరలేపారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఆ పార్టీని దెబ్బ కొట్టాలని, తద్వారా టీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టి మైండ్‌గేమ్ ఆడాలని కాషాయపార్టీ పెద్దలు ప్లాన్ వేశారు. కానీ బీజేపీ మైండ్‌గేమ్ బెడిసికొట్టింది.
బీజేపీ టార్గెట్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ భారీ కుట్రను ఛేదించారు. బీజేపీ తీరుపై రాజకీయ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో బీజేపీ తన సత్తా చాటుకోవడానికి ఏరికోరి తెచ్చింది. అడ్డదారిలో గెలుపు కోసం కుట్రలు మొదలుపెట్టిన బీజేపీ, తొలుత స్థానిక టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల కొనుగోలు చేసింది. నేతల స్థాయిని బట్టి నజరానాలు ఇచ్చింది. కొందరికి కార్లు బహుమతిగా ఇచ్చింది. స్థానిక నేతల కొనుగోలు పూర్తి కావడంతో ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలపైనే కన్నేసిందని అంటున్నారు.