రవీంద్రభారతి( హైదరాబాద్ ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ( BC reservations ) సాధించకుంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని బీసీ జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ , నేషనల్ బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య (Justice Easwariah) హెచ్చరించారు. ఈ నెల 24న ధర్నాచౌక్‌లో నిర్వహించనున్న బీసీ మహాధర్నా ( BC Mahadarna ) సన్నాహక సమావేశం బుధవారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్, అయిలి వెంకన్నగౌడ్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈ బిల్లుకు అప్పట్లో అన్ని పార్టీలు మద్దతు తెలిపి తర్వాత మాట మార్చాయని మండిపడ్డారు. బీసీలకు న్యాయం జరగాలంటే తమిళనాడు తరహాలో రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, అదే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదని ప్రశ్నించారు. బీసీలను మోసం చేయడానికి జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయన్నారు.
బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లోనే పెడితేనే బీసీ రిజర్వేషన్లు నిలబడుతాయని,లేకుంటే కోర్టులు కొట్టివేస్తాయని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు అన్నారు. 42శాతం రిజర్వేషన్ల సాధన దశలో రెండు వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశాయని తెలిపారు. డిసెంబర్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షపార్టీయైన కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టించాలని డిమాండ్ చేశారు .
బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే పదిరెట్లు పెద్దది అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో సింగం నాగేశ్వర్‌గౌడ్, డాక్టర్ రాం నర్సింహాగౌడ్, దామోదర్‌గౌడ్, డాక్టర్ విజయభాస్కర్, బైరి శేఖర్, చామకూర రాజు, ఎస్.దుర్గయ్యగౌడ్,రాచాల యుగంధర్‌గౌడ్,రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.