హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): చోరీల్లో ఆరితేరిన వాడిని మనం నంబర్‌వన్ చోర్ అనడం పరిపాటి. కానీ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో అడ్డంగా దొరికిన బీజేపీ దూత సతీశ్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి మాత్రం సేమ్ నంబర్ చోర్ అనక తప్పదేమో.. ఎందుకంటే ఒకే ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు వేర్వేరు అడ్రస్‌లతో, వేర్వేరు పేర్లతో కార్డులు సృష్టించాడు. పాన్ కార్డుల విషయంలోనూ ఇదే దొంగ ఫార్ములా అనుసరించాడు. అంతటితో ఆగలేదు. రెండు వేర్వేరు డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా చెలామణిలోకి తెచ్చాడు. గురువారం సీఎం కార్యాలయం విడుదల చేసిన డాక్యుమెంట్లలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నంబర్ ఒకటే.. పేర్లు, అడ్రస్‌లు వేరు
ఒకే ఆధార్ నంబర్ 8387 1396 1412తో సతీశ్ శర్మ రెండు అడ్రస్‌లతో రెండు కార్డులు, మరొకటి రామచంద్రస్వామీజీ పేరుతో సృష్టించాడు. మొదటిది.. సతీశ్ శర్మ వీకే, కేరాఫ్ వీవీ కృష్ణమూర్తి, ఇంటి నం. 374, సెక్టార్-31, అమర్‌నగర్, ఫరీదాబాద్, హర్యానా-121003 అడ్రస్‌తో ఉన్నది. మరొక కార్డుపై అడ్రస్.. 229/1 రాదాసర, సెక్టార్-31, నియర్ పార్క్, అమర్‌నగర్, ఫరీదాబాద్, హర్యానా-121003తో ఉంది. ఇందులో ఫోన్ నంబర్ 7075779637 కూడా ఉన్నది. ఆధార్ నంబర్ అదే కానీ వేరే పేరు, వేరే అడ్రస్‌తో మరో కార్డు ఉన్నది. ఆ కార్డులో రామచంద్ర స్వామీజీ, సన్ ఆఫ్..మహాస్వాని శ్రీ మడ్వధరమ్దత్జీ, పహాడీ రోహ్నియ, మండ్వై జలాలిపట్టి, వారణాసి బులందర్, ఉత్తరప్రదేశ్-221108 అడ్రస్ ఉంది. దీనిపై 8839299722 ఫోన్ నంబర్ ఉన్నది.
ఒకే పాన్ నంబర్-రెండు పేర్లు
సతీశ్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి ఒకే పాన్ నంబర్‌ను రెండు వేర్వేరు పేర్లతో కలిగి ఉన్నాడు. పాన్ నంబర్ LTLPS2896Dతో ఒకటి సతీశ్ శర్మ పేరుతో మరొకటి రామచంద్రస్వామీజీ పేరుతో జారీ అయ్యాయి.
రెండు డ్రైవింగ్ లైసెన్స్‌లు
సతీశ్‌శర్మ అలియాస్ రామచంద్రభారతికి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రెండేసి ఉన్నాయి. ఒకటి 2010లో జారీ కాగా, రెండోది ఈ ఏడాది ఆగస్టులో తీసుకున్నాడు. ఈ రెండింటిలో రెండు వేర్వేరు అడ్రస్‌లు ఉండటం మరో ట్విస్ట్. ఈ ఏడాది ఆగస్టు 9న HR51 20220018798 నంబర్‌తో జారీ అయిన లైసెన్స్‌పై H NO: 374 సెక్టార్-31, అమర్‌నగర్, ఫరీదాబాద్, హర్యానా, 121003 అన్న అడ్రస్ ఉన్నది. రెండో లైసెన్స్‌పై పుత్తూర్, టీక్యూడీకే, గని గద్దె హౌస్, సంపాజీ పోస్ట్, పుత్తూరు, దక్షిణ కన్నడ, 574201 అన్న అడ్రస్ ఉన్నది. ఈ లైసెన్స్‌ను 2010లో మే 14న జారీ చేశారు.