Rs 2 Biryani | బిర్యానీ ప్రియులకు అదిరిపోయే వార్త. పసందైన బిర్యానీ కేవలం రూ.2కే ఆస్వాదించొచ్చు. ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాద్‌లోనే. మీరు విన్నది నిజమేనండి.. ఈ బిర్యానీని రూ.2కే ఆఫర్ చేస్తున్నది నాయుడిగారి కుండ బిర్యానీ రెస్టారెంట్ యాజమాన్యం. అయితే, ఇక్కడ మెలిక పెట్టారు నిర్వాహకులు. రూ.2 నోట్‌ను తీసుకువచ్చిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని యాజమాన్యం పేర్కొంది. రూ.2 నోట్‌ను ఇచ్చి నాన్ వెజ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీలో ఏదైనా రుచి చూడొచ్చని తెలిపింది.
నెల రోజుల కిందట ప్రారంభించిన ఈ రెస్టారెంట్‌కి ఇప్పటి వరకు రూ.2నోట్లు 120 వచ్చాయని తెలిపారు. ప్రజల వద్ద ఇంకా రూ.2నోట్లు ఉన్నాయా? లేదా? తెలుసుకునేందుకు ఈ ఆఫర్‌ను ప్రారంభించామని, ప్రస్తుతం మంచి స్పందన వస్తుందని రెస్టారెంట్ యాజమాని మనోహర్ తెలిపారు. రెస్టారెంట్లో వెబిటబుల్, చికెన్, మటన్ దమ్ బిర్యానీలు, ముఘలాయి చికెన్ బిర్యానీ, దిల్కుష్ చికెన్ బిర్యానీ, జపనీస్ కంజుపిట్ట బిర్యానీ, చేపలు, రొయ్యల బిర్యానీలతో సహా పలు రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంతకు ముందు ఈ రెస్టారెంట్ 30 నిమిషాల్లో 30 కంటే ఎక్కువ వెరైటీలు ఉన్న బాహుబలి థాలీ తినాలని భోజన ప్రియులకు సవాల్ విసిరింది.
అరగంటలోనే థాలీని తింటే రూ.లక్ష అందిస్తామని తెలిపింది. ఈ థాలీలో చికెన్ బిర్యానీ, రొయ్యల కూర, సలాడ్, రైతా, డ్రింక్స్‌తో పాటు వెజ్, నాన్‌వెజ్ వంటకాలు ఉంటాయి. ముగ్గురు నలుగురికి సరిపోయే ఈ థాలీ ధర రూ.1,999 కాగా.. ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్‌లో కేవలం ఏడుగురు వ్యక్తులు మాత్రమే విజయం సాధించారు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ ఇంకా వినియోగదారులకు అందుబాటులో ఉన్నది. హైదరాబాద్ అంటేనే అందరికీ బిర్యానీ గుర్తుకు వస్తుంటుంది. వీకెండ్ సమయంలో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి బిర్యానీని ఆస్వాదిస్తుంటారు. బిర్యానీ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని పలు రెస్టారెంట్లు సైతం ఆఫర్లను సైతం ఇస్తున్నాయి.