హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడు నెలల కాలంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను తన వంతుగా ఆదుకుంటా.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఏటా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా స్ఫూర్తిని పంచుతున్న ఆయన ఈసారి నిరుపేద కుటుంబాల పిల్లలకు చేయూతనందించారు.
బుధవారం కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్యతో కలిసి హైదరాబాద్ స్టేట్హోంలో విద్యార్థుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి 100 మంది విద్యార్థినులకు కేటీఆర్ ల్యాప్టాప్లను అందజేశారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా నవ్వులు పూయించే కేటీఆర్.. ఈసారి చేనేత కుటుంబాలకు అండగా నిలిచి మానవీయతను చాటుకున్నారు. అత్యధిక మం ది చేనేత కుటుంబాలు ఉన్న సిరిసిల్ల నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తుండటంతో, వారి ఇబ్బందులను తీర్చాలని నిర్ణయించుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐదేండ్ల క్రితం తన పుట్టినరోజున ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
చేనేత కుటుంబాలు, వారి పిల్లల విద్య, భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థికసాయం చేయనున్నట్టు ప్రకటించారు. 2020లో కరోనా సమయం నుంచి తన పుట్టినరోజున ఇతరులకు సాయంచేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నానని, తనతోపాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారని తెలిపారు. ఈ ఐదేండ్లలో అంబులెన్స్లతోపాటు 6,000 మంది విద్యార్థులకు టాబ్స్, 1,400 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సూటర్లను అందజేశానని వివరించారు. పెద్దలు చెప్పిన్నట్టు పుట్టుక, మరణం మాత్రమే నిజమని, మధ్యలో మిగిలినదంతా నిజమో? అబద్ధమో? తెలియని పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జీవితంలో మనసుకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు చేసినప్పుడే ఎకువ సంతోషం కలుగుతుందని చెప్పారు. విద్యార్థినుల ఉన్నత విద్యకు లాప్టాప్లు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నిరుడు జన్మదినం సందర్భంగానే స్టేట్హోమ్ విద్యార్థులకు లాప్టాప్లు ఇవ్వాలని నిర్ణయించుకోగా, ఎన్నికల కారణంగా ఇవ్వలేకపోయానని, ఆ హామీని ఈ పుట్టినరోజున నెరవేర్చానని చెప్పారు.