మియాపూర్, ఏప్రిల్ 15: శేరిలింగంపల్లి జోనల్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌గా, చార్మినార్ జోన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ మంగళవారం గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్‌జోన్ పరిధిలో పచ్చదనం పనులకు ఒక గుత్తేదారుకు బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ రూ.2.2 లక్షలు డిమాండ్ చేయగా, సదరు గుత్తేదారు రూ.1.5 లక్షలు చెల్లించాడు. మిగిలిన రూ.70 వేలను శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి నగదును స్వాధీనం చేసుకుని, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.