హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : పంటల వ్యర్థాలు, అవశేషాలను ఉపయోగించి పైరోలిసిస్ విధానంలో తయారు చేసే బయోచార్.. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ డీ రాజిరెడ్డి అన్నారు. రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో బయోచార్ విధానంపై మంగళవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాజిరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన రంగంలో బయోచార్ వినియోగంతో కలిగే ప్రయోజనాలను వివరించారు.
నేల సారాన్ని పెంపొందించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, సూక్ష్మజీవుల క్రియాశీలతకు మద్దతు ఇవ్వడం బయోచార్ వాడకంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. బయోచార్లాంటి ఆవిషరణలు రైతులకు శక్తిని ఇస్తాయని, నేలలను సుసంపన్నం చేస్తూ భవిష్యత్ తరాలకు పోషక భద్రతను అందిస్తాయని రాజిరెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో బయోచార్ నిపుణులు డాక్టర్ ఆరిఫ్ఖాన్, రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, పువ్వుల పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ జ్యోతి, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.