Current Bill | ఐనవోలు,ఆగస్టు 4 :పనిచేయని విద్యుత్తు మీటర్కూ బిల్ వేశారని ఓ వినియోగదారు డు ఆందోళన వ్యక్తం చేశాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తికి చెంది న మేరుగు సురేశ్ ఇంటి మీటర్ పనిచేయడం లేదు. జూలై 6న బిల్ నమోదుకు వచ్చిన సిబ్బంది యావరేజ్ బిల్ కింద 304 యూని ట్ల విద్యుత్తు వినియోగించినట్టు పేర్కొంటూ రూ.1999 బిల్ వేశారు. ఈ విషయమై గత నెలలో అధికారులను వివరణ కోరగా.. మీట ర్ పని చేయనందున యావరేజ్ బిల్గా నమోదైందని, వచ్చే నెల ఉపయోగించిన బిల్ మాత్రమే వస్తుందని తెలిపారు. ఆ తరువాత వారం రోజుల్లో కొత్త మీటర్ అమర్చారు.
ఆదివారం విద్యుత్ బిల్ ఇవ్వగా గత నెలలో వచ్చిన విధంగానే 31 రోజులకు గాను 304 యూనిట్లు విద్యుత్తు వినియోగించినట్టుగా రూ.2002 బిల్ వచ్చిందని బాధితుడు సురేశ్ వాపోయాడు. మీటర్ చూసి బిల్ వేయాలని అడిగినా పట్టించుకోకుండా యావరేజ్ బిల్ నమోదు చేశారని పేర్కొన్నాడు. కొత్తగా అమర్చిన మీటర్లో 72 యూనిట్లు మాత్రమే వినియోగించినట్టు తెలిపాడు. బిల్లు కట్టాలని అధికారులు చెబుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశా డు. ఈ విషయమై ఏఈ పద్మను వివరణ కోరగా.. వినియోగదారుడు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చాడని, రెండు బిల్లులను పరిశీలించి, పరిష్కరిస్తామని తెలిపారు.