బుట్టాయిగూడెం.. ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం. కుమ్మరి మంజుల అనే యువతికి తీవ్రంగా జ్వరం వచ్చింది. బాగా నీరసించి పోయింది. కుటుంబసభ్యులు 108కు ఫోన్ చేశారు. వారి మండలానికి చెందిన అంబులెన్స్ అప్పటికే వేరే బాధితుడి వద్దకు వెళ్లింది. పక్క మండలం నుంచి అంబులెన్స్ రావడానికి కనీసం 50 నిమిషాలు పడుతుంది. దీంతో 108 సిబ్బంది సమీపంలోని బైక్ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ ) సోద కుమారస్వామి అక్కడకు వచ్చి, మంజులను పరీక్షించారు. స్లైన్ ఎక్కించి, ప్రాథమిక చికిత్స అందించారు. మరో 40 నిమిషాల తర్వాత అంబులెన్స్ రావడంతో ఆమెను ఏటూరునాగారంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బైక్ అంబులెన్స్ వల్ల మంజులకు సుమారు 40 నిమిషాలు ముందుగానే వైద్యం అందింది.
హైదరాబాద్/ములుగు, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): అన్ని ప్రాంతాలకు అంబులెన్స్‌లు వేగంగా వెళ్లలేవు. కొండప్రాంతాలు, ఇరుకైన గల్లీల్లో తిరగడం మరీ కష్టం. ఒక్కోసారి వరదలు, ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు కూడా ప్రతిబంధకాలుగా మారతాయి. ఇలాంటి సమయాల్లో సైతం బాధితులకు అత్యవసర, ప్రాథమిక వైద్యం అందించాలన్న లక్ష్యం తో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినవే బైక్ అంబులెన్స్‌లు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 50 బైక్ అంబులెన్స్‌లు సేవ లు అందిస్తున్నాయి. అనేకమంది ప్రాణాలను నిలబెడుతున్నాయి. వీటి ద్వారా నెలకు సగటున 1,600 నుంచి 2 వేల మంది ప్రాథమిక వైద్యసేవలు పొందుతున్నారు. నిరుడు 20 వేల మందికిపైగా సేవలు పొందారు. మారుమూల ములుగు జిల్లాల్లో అత్యధికంగా 2,564 మందికి సేవలు అందించాయి. బైక్ అంబులెన్స్‌లు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు ఉన్నాయి. ములుగు, హనుమకొండ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఐదు చొప్పున, ఆదిలాబాద్, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో నాలుగు, మంచిర్యాలలో మూడు, మహబూబాబాద్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రెండు, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో 25, జీహెచ్ఎంసీ పరిధిలో 10 బైక్ అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి.
ఆపదలో ఉన్న ప్రజలు 108కు ఫోన్ చేస్తే.. అధికారులు మాకు సమాచారం ఇస్తారు. మేము వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ప్రాథమిక వైద్యసేవలు అందిస్తున్నాం. ఈ కిట్‌లో అత్యవసర మందులు ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంటాయి.
– సోద కుమారస్వామి, ఈఎంటీ, ఏటూరునాగారం, ములుగు జిల్లా