Tigers | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): చాలా ఏండ్ల తర్వాత రాష్ట్రంలో పెద్దపులుల గాండ్రింపులు పెరిగాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోనే కాకుండా కొత్త ప్రదేశాల్లోనూ పులులు సంచరిస్తున్నాయి. 30,40ఏండ్ల తర్వాత కొన్ని ప్రాంతాల్లో పెద్దపులుల కదలికలు రికార్డు కావడంపై అటవీశాఖ హర్షం వ్యక్తంచేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మెరుగైన అటవీ, అనుకూల పరిస్థితులు ఉండటంతో మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాల్లోంచి రాష్ట్రంలోకి పులుల వలసలు క్రమంగా పెరుగుతున్నట్టు అటవీశాఖ గుర్తించింది.
రాష్ట్రంలోని 13కు పైగా జిల్లాల్లో పులుల కదలికలను ఇటీవల గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. కొన్నేండ్లుగా పెద్ద పులులు కనిపించని భూపాలపల్లి, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, మంచిర్యాల, ఇచ్చోడ, బోథ్, పెద్దపల్లి వంటి ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో పులుల కదలికలు నమోదయ్యాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా 33 పులులు ఉన్నట్టు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్ర-తెలంగాణ టైగర్ కారిడార్, సరిహద్దు ప్రాంతాల్లో ఐదారు పెద్ద పులులు సంచరిస్తున్నట్టు తాజాగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
దాదాపు 10-15 ఏండ్ల కిందట ‘టైగర్ టెరిటరీ’గా ఉన్న అడవులు కొన్నిచోట్ల ఆక్రమణలతో పొలాలు, పత్తి చేన్లుగా మారిపోయాయి. పులులు మళ్లీ అక్కడికి చేరుకునేటప్పటికీ పత్తిచేన్లు ఏపుగా పెరగడం, పత్తి ఏరే కూలీలను చూసి ఎరగా పొరబడి పులులు దాడులకు పాల్పడుతున్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘటనలను ఉదహరించారు. పులిని సంరక్షించుకుంటే దాని ద్వారా ఇతర జంతువులకూ రక్షణ లభిస్తుందని, గొడుగు మాదిరిగా పులి కూడా రక్షణగా నిలుస్తుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నేచర్ స్టేట్ డైరెక్టర్ (హైదరాబాద్ సెంటర్) ఫరీదా తంపాల్ పేర్కొన్నారు.