కౌటాల, డిసెంబర్ 18 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మాకుడి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం పులి పట్టాలు దాటుతూ స్థానికులకు కనిపించింది. ఇటీవల కాగజ్‌నగర్ డివిజన్లో ఇద్దరి వ్యక్తులు, మూడు పశువులపై దాడి చేసిన పులి తర్వాత కనిపించకుండా పోయి బుధవారం ప్రత్యక్షమైంది.
మాకుడి రైల్వే స్టేషన్ సిర్పూర్ (టీ) మండలానికి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆనుకుని సిర్పూర్(టీ) ఫారెస్ట్ రేంజ్ ఉంటుంది. నిత్యం అటు ఇటు రాకపోకలు సాగిస్తాయి. పులి పట్టాలు దాటడాన్ని అధికారులు ధ్రువీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మూడు నెలల వేతన బకాయిలతోపాటు అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా బోనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం మల్టీపర్పస్ వర్కర్లు ధర్నాకు దిగారు. అనంతరం ఎంపీడీవో రురావత్ రమాదేవికి వినతిపత్రం అందజేశారు.
– బోనకల్లు
ఆదిలాబాద్ జిల్లా తాంసిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు వారం రోజులుగా సమ్మెలో ఉండటంతో
కేజీబీవీలో ఉపాధ్యాయులు లేక బోధన నిలిచింది. విద్యార్థులే తమ దిగువ తరగతి విద్యార్థినులకు బోధన చేస్తున్న దృశ్యాన్ని బుధవారం ‘నమస్తే’ క్లిక్‌మనిపించింది.
రోజూ పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీ విద్యార్థినులు ప్లకార్డులతో బుధవారం పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. ‘మా హాస్టల్లో పదోతరగతి, ఇంటర్ విద్యార్థినులు ఉన్నా.. ఉపాధ్యాయుల సమ్మెతో చదువు చెప్పేవారు లేక ఇబ్బంది పడుతున్నాం. మా టీచర్లు మాకు చదువు చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థినులు కోరారు. కాగా డీఈవో వెంకటేశ్వరాచారి కేజీబీవీని సందర్శించి వంటలను పరిశీలించారు.
– చండ్రుగొండ