Big Boss | ‘బిగ్ బాస్’ సీజన్-7 విజేతగా రైతు బిడ్డ, యూ-ట్యూబర్ పల్లవి ప్రశాంత్ ఎంపికయ్యారు. రన్నరప్‌గా అమర్ దీప్ నిలిచారు. ఈ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించిన సినీ నటుడు అక్కినేని నాగార్జున.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లను స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు పొందడంతో పల్లవి ప్రశాంత్ ‘బిగ్ బాస్ సీజన్-7’ విజేతగా నిలిచాడని నాగార్జున తెలిపారు. ఇక సినీ నటుడు శివాజీ మూడో స్థానానికే పరిమితం అయ్యాడు. చివరి వరకూ నటుడు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
బిగ్ బాస్’లోకి కామన్ మెంట్ ఎంట్రీగా పల్లవి ప్రశాంత్ వచ్చాడు. రైతు బిడ్డగా అందరి మనస్సులు చూరగొన్నాడు. రైతు బిడ్డగా ప్రశాంత్ తనకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే ఇస్తానని చెప్పాడు. ఇంతకుముందు కూడా పల్లవి ప్రశాంత్.. ఏనాటికైనా ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్లడమే తన లక్ష్యం అని సోషల్ మీడియా వేదికలపై చెప్పారు. అందుకు పలువురు హేళన చేసినా.. ఆయన పట్టించుకోలేదు. ఎట్టకేలకు ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎంటర్ కావడంతోపాటు విజేతగా నిలిచాడు.
బిగ్ బాస్ షోలో టాస్క్’లను పరిష్కరించడంలో అందరికీ గట్టి పోటీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇతర కంటెస్టెంట్ల కంటే పట్టుదలగా, గేమ్ మీదే ఫోకస్ పెట్టాడు ప్రశాంత్. ఇతర కంటెంటెస్ట్లు సైతం ప్రశాంత్‌కు గేమ్ పైనే ఫోకస్ ఎక్కువ అని కొనియాడారు. టాస్క్‌ల్లో బలమైన గాయాలైనా సరే తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగడంతోపాటు మైండ్ గేమ్స్ కు దూరంగా ఉంటూ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే తన బిడ్డ పల్లవి ప్రశాంత్ కోసం కాకినాడ, బెంగళూరు నుంచి అభిమానులు వస్తున్నారని ఆయన తండ్రి చెప్పాడు.
ఉల్టా పుల్టా అంటూ గత సెప్టెంబర్ మూడో తేదీన బిగ్ బాస్ సీజన్ -7 ప్రారంభమైంది. 105 రోజుల పాటు సాగిన ఈ బిగ్ బాస్‌లో తొలి రోజు 14 మంది, 35వ రోజు ఐదుగురు హౌస్ లోకి వెళ్లారు. చివరికి టాప్-6లో ఫైనలిస్టులుగా అమర్ దీప్, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ, యావర్ నిలిచారు. చివరకు అందరి మద్దతుతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నాడు.