Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): షాపింగ్ మాల్స్‌లో కొనుగోలుదారులకు దసరా డిస్కౌంట్లు ఇచ్చినట్టుగా ఇప్పుడు పౌరసరఫరాల శాఖలో ధాన్యం టెండర్లను దక్కించుకున్న బిడ్డర్లు సైతం రైస్ మిల్లర్లకు ఇదే తరహా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మొన్నటివరకు ప్రతి క్వింటాలు ధాన్యానికి అదనం గా వసూలు చేసిన రూ.230లో ఇప్పుడు రూ.30 తగ్గించినట్టు మిల్లర్లలో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో అవినీతికి కూడా డిస్కౌంట్ ఇస్తున్నారంటూ ఓ మిల్లర్ వ్యాఖ్యానించారు. ధాన్యాన్ని ఇచ్చేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ బిడ్డర్లు మాత్రం తమకు ధాన్యం వద్దని, డబ్బులే ఇవ్వాలని పట్టుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యంలో ప్రభుత్వం 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేసింది. ఈ ధాన్యాన్ని దక్కించుకున్న బిడ్డర్లు.. మిల్లర్ల నుంచి ధాన్యం తీసుకెళ్లాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా ఆ ధాన్యానికి ఎంత విలువ ఉంటే అంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు మిల్లర్లు చెప్తున్నారు. తమ వద్ద ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లాలని చెప్తున్నప్పటికీ బిడ్డర్లు మాత్రం సపేమిరా అంటున్నారని మండిపడుతున్నారు. వేలంలో క్వింటాలు ధాన్యం సగటు ధర రూ.2 వేలు పలకడంతో దానికి అదనంగా రూ.230 కలిపి మొత్తం రూ.2,230 చొప్పున చెల్లించాలని బిడ్డర్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. దీనికి మిల్లర్లు ససేమిరా అనడంతో దసరా ఆఫర్ కింద క్వింటాలుకు రూ.30 చొప్పున తగ్గించి, మిగిలిన మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని బిడ్డర్లు గడువు విధించినట్టు సమాచారం. దీనిపై మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం ఇస్తామన్నా తీసుకోకుండా అదనంగా డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
టెండర్ ధాన్యానికి బదులుగా అధిక మొ త్తంలో డబ్బులు వసూలు చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఇది ఉన్నతాధికారులు తెలియకుండానే జరుగుతున్నదా? లేక వారికి తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. టెండర్ ధాన్యాన్ని ఎత్తేందుకు బిడ్డర్లకు ఇచ్చిన గడువు ఈ నెల 23తో ముగిసింది. దీంతో ఈ గడువును పొడగించి 15 రోజుల్లో మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చే యాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. వీలైనంత ఒత్తిడి తీసుకొచ్చి నయానో భయా నో వారి నుంచి వసూలు చేసేందుకు బిడ్డర్లు ప్రణాళికలు రూపొందించుకున్నట్టు తెలుస్తున్నది. దీనికి అధికారులు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.