హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): భూ సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు పూర్తయిందని లీఫ్స్ సంస్థ తెలిపింది. రైతుల సమస్యలను గుర్తించేందుకు భూ చట్టాల నిపుణుడు సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో లీఫ్స్ 10 గ్రామాల్లో అధ్యయనం చేసింది. సంస్థ న్యాయవాదులు గ్రామాలకు వెళ్లి ‘భూ న్యాయ శిబిరాలు’ ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
సోమవారం మంథని గౌరెల్లిలో చివరి శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. తాము ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్ ద్వారా దరఖాస్తులు తీసుకున్నామని తెలిపారు. రైతులను పిలిపించుకొని, వారి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా నివేదికలు తయారు చేసినట్టు వెల్లడించారు. 10 గ్రామాల్లో 2,200 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి సమస్యకు నివేదికను సిద్ధం చేస్తున్నామని, వాటిని మంత్రి పొంగులేటికి సమర్పించనున్నట్టు చెప్పారు. ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిషరించేందుకు, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని వివరించారు. లీఫ్స్ సంస్థ ప్రతినిధులు జీవన్‌రెడ్డి, కొంపెల్లి మల్లేశ్, ప్రవీణ్, ఈరుగు రవి తదితరులు పాల్గొన్నారు.