హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): భూ యజమానులకు మేలుచేసేది అంటూ ఏడాది క్రితం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతుల నెత్తిన పిడుగులా పరిణమించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘సమాజంలో అట్టడుగు వర్గా లు మొదలుకొని భూ యజమానులందరికీ మేలుచేసేలా విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణతో రూపొందించిన 2024 భూ భారతి చట్టం.. అక్షరాలా భూయజమానులకు చు ట్టం.
ఇది నిజమైన ప్రజా చట్టం. అక్షరాలా భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ చుట్టం’ అని సరిగ్గా ఏడాది కిందట రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త ఆర్వోఆర్ చట్టం ‘భూభారతి’ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఓవైపు ధరణిని విమర్శిస్తూ, మరోవైపు భూభారతిని సర్వరోగ నివారణిగా అభివర్ణించారు. ‘దేశానికే రోల్ మోడల్‌గా ఉండే రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్ట డం నా అదృష్టం’ అని చెప్పుకొన్నారు. ఏడాది తర్వాత పరిస్థితిచూస్తే పూర్తి విరుద్ధంగా తయారైంది. భూభారతి కాస్తా ‘భూ హారతి’గా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భూ భారతి చట్టం అమల్లోకి వస్తే భూ సమస్యలన్నీ సమసిపోతాయని ప్రభుత్వం ప్రగల్భా లు పలికింది. ‘యముడి నుంచి భర్త ప్రాణాలను తెచ్చుకున్న సతీసావిత్రిలా.. ధరణిలో పో యిన భూములను భూభారతితో తిరిగి హక్కుదారులకు చేర్చే పరిస్థితి ఏర్పడింది’ అని నాడు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు భూ సమస్యలు రెట్టింపు అయ్యాయని రైతులు వాపోతున్నారు. పాతవి పరిష్కరించలేదని, పైగా కొత్తవి తెచ్చి పెట్టారని మండిపడుతున్నా రు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించకుండానే నోటీసులు జారీ చేశారని, సర్వే నంబర్లను బ్లాక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రం లో సుమారు రెండు కోట్ల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు రంగం సిద్ధమైనట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో భూ రికార్డులను మార్చే అధికారం కిందిస్థాయి అధికారులకు ఉండటంతో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే ధరణి చట్టంలో అధికారుల విచక్షణ అధికారాలను తొలగించింది. కేవలం కలెక్టర్లకే ఆ అధికారాన్ని కట్టబెట్టింది. కానీ భూభారతి చట్టం ద్వారా మళ్లీ అధికారులకు విచక్షణ అధికారాలు వచ్చాయి. దీంతో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రికార్డుల్లో మార్పులు, చేర్పులకు అడిషనల్ కలెక్టర్లే లంచాలు అడుగుతున్నారంటూ ఏకంగా ప్రభుత్వ అనుకూల పత్రికలోనే కథనం ప్రచురితమైంది. అన్నీ సక్రమంగా ఉన్నా సరే ఫైల్‌పై సంతకం పెట్టాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో ఫైల్‌ను పక్కన పడేస్తున్నారని ఆ కథనం ఆరోపించింది. అడిషనల్ కలెక్టర్ల దోపిడీయే ఈ స్థాయిలో ఉంటే ఇక కిందిస్థాయి నుంచి పై వరకు భూభారతి కారణంగా అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇకప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి వాస్తవాలను గ్రహించాలని, రైతులకు ప్రయోజనం కలిగించేలా చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.