కామారెడ్డి, అక్టోబర్ 5: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) డిమాండ్ చేసింది. రుణమాఫీ, రైతుభరోసా, పంటకు రూ.500 బోనస్ సహా వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నింటినీ సంపూర్ణంగా అమలు చేయాల్సిందేనని స్పష్టంచేసింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం బీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభలకు రైతులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి మోహిన్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పాల కల్తీని అరికట్టి, పెండింగ్లో ఉన్న పాడి రైతుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. వ్యవసాయ సంబంధిత ధాన్యాలు, వంట నూనెల కల్తీని అరికట్టాలని, జంతు కొవ్వులతో తయారు చేస్తున్న వంట నూనెలను నియంత్రించాలని, కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా వరి సహా అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.