హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో ‘భారత్ బచావో’ పేరిట సన్నాహక సమావేశం నిర్వహిస్తామని కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, గాదె ఇన్నయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో మానతావాదులు, లౌకికవాదులు, న్యాయకోవిదులు, జాతీయవాదులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం హిందూత్వ ఎజెండాను అమలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నదని, అది అమలైతే దళితులు, బహుజనుల అభ్యున్నతికి తీవ్ర విఘాతమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ పతనమవుతున్నదని విమర్శించారు.