హైదరాబాద్, మే 4 (నమస్తేతెలంగాణ): భగీరథుడి స్ఫూర్తితోనే కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసి, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను పంచారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ జయంత్యుత్సవాలను నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జూలూరి గౌరీశంకర్, పల్లె రవికుమార్‌గౌడ్, సుమిత్రానంద్, చిరుమల్ల రాకేశ్, కే కిశోర్‌గౌడ్, తుంగబాలు, విజయేంద్రసగరతో కలిసి భగీరథుడి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. కేసీఆర్ పాలనలోనే శ్రామిక వర్గాలకు న్యాయం జరిగిందని ఉద్ఘాటించారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ భగీరథుడి జయంతిని అధికారికంగా నిర్వహించి, ప్రతిష్ఠాత్మకమైన తాగునీటి పథకానికి మిషన్ భగీరథ అని పేరుపెట్టి సముచిత గౌరవం ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో బడుగులకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. భగీరథుడి జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కొనియాడారు. బీఆర్ఎస్ పాలనలోనే సగరులకు మేలు జరిగిందని విజయేంద్ర సగర తెలిపారు.