హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): దేశంలో జల జీవవైవిధ్యానికి తెలంగాణ నెలవుగా మారిం ది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో జల సంపద, హరితహారం కార్యక్రమంతో పచ్చదనం భారీగా పెరగడం ఇందుకు కారణమని తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు అధ్యయనంలో తేలింది. సీసీఎంబీ-లాకోన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ కాళీచరణ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ అధ్యయన వివరాలను వెల్లడించారు. జలవనరుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మెరుగైన ఫలితాలు రావడంతోపాటు పర్యావరణ పరంగానూ ఎన్నో మార్పులు జరిగినట్టు వివరించారు. గతంలో కబ్జాకు గురైన ఎన్నో చెరువులు, కుంటలకు విముక్తి కల్పించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంతో కొత్త కళను సంతరించుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64వేల జల వనరులు ఆక్వాటిక్ బయోడైవర్సిటీకి నెలవుగా మారాయని, వాటిలో నీటిపై తేలే 87 జీవజాతులు, 41 మొలస్కా జాతులు, 7 సరీసృప జాతులు సహా 432 రకాల జీవజాతులు ఉన్నట్టు చెప్పారు.