నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 13: సర్కార్ వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. రాష్ట్రంలోని ఏ దవాఖాన చూసిన ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఉన్నది. వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఉన్న వైద్యులు, సిబ్బంది సైతం సమయపాలన పాటించక పోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యంత్రాలు పనిచేయక పేదలకు సరైన సేవలు అందడం లేదు. ఇన్‌పేషంట్లు పెరుగుతున్నా అందుకు అనుగుణంగా బెడ్లు లేకపోవడంతో ఒకే బెడ్డుపై ఇద్దరికి వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొన్నది. నిర్వహణ సరిగా లేక దవాఖానల్లోని మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. ఆవరణల్లో సైతం ఎక్కడి చెత్త అక్కడే అన్నట్టుగా ఉన్నది. ఉత్తర తెలంగాణ ప్రజలకు గుండెకాయ వంటి వరంగల్ ఎంజీఎం దవాఖానను సమస్యల జబ్బు వెంటాడుతున్నది. వైద్యులు, సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉన్నా నిర్దేశిత టెస్ట్‌లు జరగటం లేదు.
మందులు, ఇంజక్షన్లు, వీల్చైర్లు, ట్రాలీల కొరత ఉన్నది. కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యవసర సేవలు కలగానే మిగిలాయి. మానుకోట జిల్లాలో సగటున ప్రతి నాలుగిండ్లకు ఒక జ్వర బాధితుడు ఉన్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన గంగారం, కొత్తగూడ, బయ్యారం, గార్ల ఏజెన్సీ మండలాల్లో ఇంటికో జ్వర బాధితుడు ఉన్నాడు. ఆదిలాబాద్ రిమ్స్‌లో నర్సుల కొరత ప్రధాన సమస్యగా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్ర దవాఖానలో అధునాతన సీటీ స్కానింగ్ యంత్రం వచ్చి నెలలు గడుస్తున్నా టెక్నీషియన్ లేక సేవలు ప్రారంభించలేదు. జనగామ జిల్లా దవాఖానలో కడుపునొప్పితో వెళ్తే డాక్టర్లు సానింగ్ కోసం బయటకు పంపుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది.