హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాలు ముస్లిం బాలికల ఉజ్వల భవిష్యత్తుకు నిలయాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు ముస్లిం మైనారిటీల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కార్ఖానాలో, మెకానిక్ షెడ్లలో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ఉండేది. పాఠశాల విద్య పూర్తికాకుండానే బాలకార్మికులుగా మారిపోయే పరిస్థితి. బాలికల పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో ముస్లిం మైనారిటీ బాలబాలికలు బడిబాట పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 మైనారిటీ గురుకులాలు మాత్ర మే ఉండగా, అందులోనూ అరకొర వసతులే. వాటిని ఏకంగా 204కు పెంచిన సీఎం కేసీఆర్.. 97 గురుకులాలను మైనారిటీ బాలికల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఆ గురుకులాలన్నింటినీ జూనియర్ కాలేజీలుగా ఆప్‌గ్రేడ్ చేసి ఉచిత విద్యను అందిస్తున్నారు.
మైనారిటీ గురుకులాల్లో విద్యార్థినులకు కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన విద్య అందిస్తూనే, స్వశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్స్‌ను సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డార్మెటరీ, అధునాతన వ్యాయామశాలలను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల ప్రత్యేకం గా కిచెన్‌గార్డెన్‌ను ఏర్పాటుచేసి అక్కడే పలు కాయగూరలను పండిస్తున్నారు. మెరుగైన విద్యను అందించడంతో పాటు ఆటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ తదితర వాటిపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం తీసుకొంటున్న ఈ చర్యలతో ముస్లిం బాలికలు బడిబాట పడుతున్నారు.
2014-15, 2019-20ల్లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాలు.. తెలంగాణ ముస్లిం బాలికల విద్యాభివృద్ధికి అద్దం పడుతున్నాయి. ఆ రెండు సర్వేలకు అందుకు సంబంధించిన గణాంకాలపై అధ్యయనం చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ అందుకు సంబంధించిన గణాంకాలను ఇటీవల వెల్లడించింది. దాని ప్రకారం ముస్లిం బాలికల కళాశాల విద్యలో తెలంగాణ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం. పాఠశాల విద్యలోనూ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. ఏడేండ్లలో కళాశాల విద్యలో ముస్లిం బాలికల ప్రవేశాల వృద్ధి రేటు జాతీయస్థాయి సగటు 3 శాతం మాత్రమే కాగా, అందులో తెలంగాణ వృద్ధి రేటు 27 శాతం నమోదయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ముస్లిం బాలికల పాఠశాల విద్యలోనూ తెలంగాణ ఏకంగా 10 శాతం వృద్ధిని సాధించి జాతీయస్థాయిలో 3 స్థానంలో నిలిచింది
మైనారిటీ చిన్నారులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 గురుకులాలను 204కు పెంచారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య, పోషకాహారాన్ని అందజేస్తున్నాం. మైనారిటీ గురుకులాల స్థాపన లక్ష్యం నెరవేరుతున్నది. మైనారిటీ బాలికల విద్యలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలవడం ప్రభుత్వ మొక్కవోని దీక్షకు నిదర్శనం.
– కొప్పుల ఈశ్వర్, మైనారిటీ శాఖ మంత్రి
మైనారిటీ గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో గురుకులాలను ఏర్పాటు చేయడం వల్ల మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చినయ్. 2018లో పీజీటీగా ఉద్యోగంలో చేరిన నేను 2021 నుంచి ఈ బాలికల పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసే అవకాశం దక్కింది. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో 80 శాతం మంది పేద పిల్లలే. పైసా ఖర్చు లేకుండా వారిని ప్రభుత్వం 5వ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివిస్తున్నది.
– మహావీర్ పల్లవి, ప్రిన్సిపాల్, మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, నిర్మల్
మా పేద విద్యార్థులకు గొప్ప వరం.. మైనారిటీ గురుకులాలు. ప్రైవేట్, కార్పొరేట్ కంటే గొప్పగా, ఉచితంగా ఇక్కడ చదువు చెప్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉన్న దానికంటే రెట్టింపు భరోసా కల్పించి బోధన అందించాలన్న సీఎం కేసీఆర్ సార్ సంకల్పం మాలాంటి వారికి అదృష్టం.
– ఎస్కే సనా, పదో తరగతి, మైనారిటీ గురుకుల పాఠశాల, నల్లగొండ